శ్రీ గణేశాయనమః
**
శరన్నవరాత్రులలో శివకల్యాణం – నృత్యరూపకం**
‘సమన్వయ సరస్వతి ‘, ‘వాగ్దేవీవరపుత్ర ‘, ‘శివతత్త్వసుధానిధి ‘ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు అనేక పురాణాలలోనున్న శివపార్వతుల కల్యాణ వైభవాన్ని ప్రతి ఒక్క ఘట్టం, వాటిలోని రహస్యాలను క్రోడీకరించి రచించిన 20కి పైగా ఉన్న ‘ శివకల్యాణ గీతాలు ‘ శ్రీ ఎన్.సి.హెచ్. బుచ్చయ్యాచార్యులు, శ్రీ ఎన్.సి. కౌశిక్ కల్యాణ్ స్వరపరచి గానం చెయ్యగా ధ్వనిముద్రికలుగా విడుదలై బహుళ ప్రజాదరణ పొందాయి.
ఆ గీతాలకు Uttaraa Centre for Performing Arts (UCPA) కి Founder Director అయిన ‘ అభినయ కళారత్న’ శ్రీమతి గీతా గణేశన్ గారి నృత్యరూప కల్పనలో భరతనాట్య శైలిలో నృత్యరూపకంగా శ్రీ శృంగేరి శంకరమఠం, నల్లకుంట, హైదరాబాదులో తే.30.09.2022, శుక్రవారం సాయంత్రం 7 గంటలకు శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమంగా అత్యద్భుతంగా ప్రదర్శించబడింది.
ఈ కార్యక్రమం వీక్షించడానికి వచ్చిన జనవాహినితో శంకరమఠం ప్రాంగణం అంతా క్రిక్కిరిసిపోయింది. ప్రతి ఒక్క సన్నివేశ నృత్యానికి వచ్చినవారందరూ శివానుభూతికి లోనై వారి ఆనందాన్ని కరతాళధ్వనులతో తెలియజేశారు.
కార్యక్రమానంతరం శృంగేరి శంకరమఠం, నల్లకుంట నిర్వాహకులు శ్రీ రవీంద్ర గారు వారి స్పందనను తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎంతగా శివపార్వతుల కల్యాణాన్ని కళ్ళకు కట్టించి హృదయంలో ప్రతిష్ఠింపజేసిందో తెలియడానికి ఆహూతుల హర్షధ్వానాలే సాక్ష్యమన్నారు. నృత్యప్రదర్శన గావించిన వారందరికీ శంకరమఠం తరపున తగురీతిన సత్కరించారు.
ఋషిపీఠం ట్రస్టీ అయిన శ్రీ మారేపల్లి సూర్యనారాయణ గారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి శివపదం గురించి, శివకల్యాణగీతాల ఆవిర్భావం గురించి వివరించి, ఆ గీతల భావాలకు అనుగుణంగా ఎంతో దీక్షతో అనేకమంది నృత్యకారిణుల చేత ప్రదర్శింపజేసిన శ్రీమతి గీతాగణేశన్ గారికి ఋషిపీఠం తరపున అభినందనలు తెలియజేశారు. ఇంత గొప్ప కార్యక్రమానికి వేదిక కల్పించిన శంకరమఠం మేనేజర్ శ్రీ కృష్ణారావుగారికి ధన్యవాదాలు తెలియజేశారు.